: ఎలుకల్లోనూ వారసత్వ లక్షణాలుంటాయ్!
మనుషుల్లో వారసత్వ లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఎలుకల్లో కూడా ఇలాగే వారసత్వ లక్షణాలు కనిపిస్తాయట. ఈ విషయాన్ని ఒక తాజా అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. తండ్రి నుండి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఎలుకలు తమ పిల్లల విషయంలో కూడా ఇదే రకమైన నిర్లక్ష్యాన్ని చూపాయట. ఈ నిర్లక్ష్యం ఇలా తరతరాలుగా కొనసాగుతుందనే విషయాన్ని లైవ్‌సైన్స్ పేర్కొంది.
ఈ పరిశోధనలో పాల్గొన్న కేథరిన్ మార్లెర్ మాట్లాడుతూ క్షీరదాల్లో తండ్రి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కొన్ని రకాల జంతువుల వ్యవస్థ మాత్రమే ఉపకరిస్తుందని, మానవుల్లో కూడా తండ్రి ప్రవర్తన తీరుని కుమారుడు తన పిల్లలపై చూపిస్తాడని అన్నారు. తాము చేసిన పరిశోధనలో తండ్రి ప్రవర్తన కుమారుడికి రావడం అనేది తరతరాలు కొనసాగుతుంటుందనే విషయం తేలిందని ఆమె తెలిపారు. ఎలుకలు, కొండముచ్చులు తమ చిన్నతనంలో తల్లి రక్షణ కరవైతే అవి పెద్దయిన తర్వాత తమ పిల్లల పోషణ విషయంలో ఒత్తిడికి గురైనట్లు గతంలో జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు తండ్రి తన పిల్లల పట్ల ఎలాంటి ప్రవర్తన చూపుతాడో అదే ప్రవర్తనను కుమారుడు తన పిల్లల పట్ల కూడా చూపుతాడని చెబుతోంది. అయితే ఇది కేవలం ఎలుకల్లోనే జరిపిన పరిశోధన. ఇంకా మనుషులపై ఈ పరిశోధన నిర్వహించలేదట.