: త్వరలో అరచేతిలోనే సెల్‌ఫోన్...!
సెల్‌ఫోన్ ఇప్పుడు అందరి చేతిలోనూ ఉండే ఒక 'అవసరం' అయిపోయింది. అది లేకుండా చాలావరకూ బయటికి వెళ్లలేకపోతున్నారు. అయితే ఇప్పుడు కేవలం చేతిలోని ఫోను ద్వానానే కాకుండా ఫోనుకు కాస్త దూరంగా ఉండి కూడా మన అరచేతితో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చట... ఈ విషయంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు త్వరలో ఈ టెక్నాలజీని మనకు అందుబాటులోకి తేనున్నారు. ఫోనుకు సంబంధించిన కీబోర్డు మన అరచేతిలోనో... లేదా మరోచోటలోనో ప్రత్యక్షం అవుతుంది. మన ఫోన్‌లో ఎలాగైతే మెసేజ్‌లు పంపడం, ఫోన్ చేయడం చేస్తామో... అలాగే మన అరచేతినుండి కూడా చేసేయొచ్చట.
టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. హైస్పీడ్ విజన్, కదిలే దర్పణాల సహాయంతో మొబైల్ ఫోన్ కీబోర్డును అరచెయ్యిపై ప్రసారం అయ్యేలా చేస్తారు. దీంతో మన ఫోన్‌ను కొద్దిగా దూరం నుండైనా ఆపరేట్ చేయొచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం మన 'చేతిలోకి' రావాలంటే మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సి ఉందట. ఈ విషయానికి సంబంధించిన వివరాలను ఏబీసీ న్యూస్ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది.