Telugudesam: ’తుగ్లక్‘ అంటుంటే ఉక్రోషం పట్టలేకనే ఈ దాడులు: జగన్ పై చంద్రబాబు ఆగ్రహం
- జగన్ చేతకానితనం దేశానికి తెలిసిపోయింది
- మా హయాంలో ‘సీమ’లో ఉపాధి అవకాశం కల్పించాం
- అటువంటి మమ్మల్ని దేశద్రోహులని అంటారా?
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ ని అడ్డుకోవడం, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టిన ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. బాలకృష్ణ కాన్వాయ్ పై దాడి, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కాగడాలతో చుట్టముట్టడం.. ఏమిటివన్నీ? వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
జగన్ అవినీతి, చేతకానితనం, తెలివితక్కువతనం దేశం మొత్తం తెలిసిపోయాయని, ఆయన్ని అందరూ ‘తుగ్లక్’ అంటుంటే ఉక్రోషం పట్టలేకనే ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, అటువంటి తమను దేశద్రోహులు అంటారా? అని ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోందంటూ వైసీపీపై మండిపడ్డారు.