: యూపీఏ-2 పాలనపై ప్రధాని నివేదిక
యూపీఏ-2 పాలన యావత్తూ అవినీతిమయమని విపక్షాలు ఎలుగెత్తుతున్న నేపథ్యంలో పాలనాపరమైన నివేదిక వెలువరించనున్నారు. యూపీఏ-2 ఘనతలను ఏకరువు పెట్టేందుకు ఈనెల 22వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజుకు యూపీఏ-2 ప్రభుత్వానికి నాలుగేళ్ళు నిండుతాయి. వచ్చ ఏడాది ఎన్నికలు రానున్న తరుణంలో ఈ నివేదికే మన్మోహన్ సర్కారుకు చివరిది కానుంది. అందుకే, తమ పాలనలో తీసుకున్న ప్రతిష్ఠాత్మక నగదు బదిలీ పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి వంటి నిర్ణయాలను వార్షిక నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.
ఓవైపు బొగ్గు కుంభకోణం, రైల్వే ముడుపుల వ్యవహారం, మంత్రుల రాజీనామా వంటి ప్రతికూలతల నడుమ తమ పాలనకు కితాబిచ్చుకోవడం మన్మోహన్ కు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు సోనియాతో ప్రధాని విభేదాలు.. సర్కారుకు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడం చూస్తుంటే.. ఈ ఏడాది కేంద్రానికి మరిన్ని సవాళ్ళు తప్పవనిపిస్తోంది.