Telugudesam: జగన్ ది ఎప్పటికప్పుడు మాట తప్పే మనస్తత్వం: చంద్రబాబునాయుడు
- మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకున్న పార్టీ మాది
- కౌన్సిల్ నిర్వహణకు ఖర్చవుతుందని వంక చెబుతారా?
- ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయట్లేదు
మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకున్న పార్టీ తమదని, ఇచ్చిన మాటపై నిలబడకుండా తన స్వార్థం కోసం ఎప్పటికప్పుడు మాట తప్పే మనస్తత్వం జగన్ ది అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రభుత్వం తరఫున వాదించడానికి న్యాయవాదికి రూ.5 కోట్లు ఇచ్చారని, సీఎం జగన్ నివాసానికి సెక్యూరిటీకి రూ.41 కోట్లు అవుతుందని జీవో ఇచ్చారని, కౌన్సిల్ అరవై రోజులు నిర్వహిస్తే రూ.60 కోట్లు ఖర్చవుతుందని వంకలు పెడతారా? సీఎం జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్య కాలంలో చట్టసభలను ముప్పై నుంచి నలభై రోజులకు మించి నిర్వహించలేదని, బడ్జెట్ సెషన్స్ కూడా పదిహేనురోజుల కన్నా ఎక్కువగా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ఒక మాట, గెలిచిన తర్వాత మరోమాట జగన్ మాట్లాడుతున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.