Chandrababu: నా కంటే చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేస్తున్నా.. తొందరపడద్దు!: అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగం
- రాజధాని అమరావతిని తరలించవద్దు
- రాష్ట్రానికి మూడు రాజధానులు మంచిది కాదు
- ఆలోచించండి.. తొందరపడొద్దు
రాజధాని అమరావతిని తరలించవద్దని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిది కాదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. నాడు తన హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ తన తర్వాత సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని గుర్తుచేసుకున్నారు. కనీసం తన తండ్రిని జగన్ స్ఫూర్తిగా తీసుకుని రాజధాని అమరావతిని పూర్తి చేయాలని కోరారు.
‘నాకు జగన్మోహన్ రెడ్డిపై కోపం లేదు. నా కంటే చిన్నవాడైనా రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఆలోచించండి.. తొందరపడొద్దు.. ఇది మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు సక్సెస్ కాలేదు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు’ అని అన్నారు. కడప జిల్లాకు రూ.1450 కోట్లు కేటాయించడం సంతోషమని, ఆ డబ్బుల్లో కొంతైనా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కేటాయించి ఉంటే అందుకు తాను మెచ్చుకునేవాడినని అన్నారు. బాగా వెనుకబడ్డ జిల్లాలకు నిధులు కేటాయించి, వాటి అభివృద్ధికి పాటుపడితే సత్ఫలితాలు వస్తాయని, అలా చేయకుండా రాజకీయంగా వెళితే ‘మీకు, రాష్ట్ర ప్రజలకు నష్టం’ అని అన్నారు.