Bengal: కథ చెబుతానని చెప్పి..మీద చెయ్యేశాడు.. బెంగాలీ దర్శకుడుపై నటి రూపాంజన మిత్రా ఆరోపణ
- భూమి కన్య అనే సిరీయల్ లో నటిస్తున్న రూపాంజన
- గట్టిగా అరవడంతో.. తన చర్యలు మానుకున్నాడు
- తాము పాత స్నేహితులం..రాజకీయం చేస్తున్నారన్న దర్శకుడు
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఇటీవల సాధారణమైపోయాయి. తాజాగా బెంగాల్ సినీ పరిశ్రమలో కూడా ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ సీరియల్ లో నటిస్తున్న నటి రూపాంజన మిత్రా ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా నోరు విప్పింది. ఓ దర్శకుడు స్క్రిప్టు గురించి మాట్లాడాలని చెప్పి తనను కార్యాలయానికి పిలిపించుకుని, తనపై చేయివేసి లైంగికంగా వేధించారని ఆరోపించారు. భూమి కన్య అనే సిరీయల్ లో నటిస్తున్న సమయంలో.. స్క్రిప్టుకు సంబంధించి చర్చించడానికి దర్శకుడు అరిందం సిల్ సాయంత్రం ఐదు గంటలకు కార్యాలయానికి ఆహ్వానించారని ఆమె చెప్పారు.
కార్యాలయంలో తామిద్దరమే ఉన్నామని.. స్ర్కిప్టు చెప్పేందుకని చెప్పి అరిందం తన సీట్ లోంచి లేచి తన వద్దకు వచ్చి తన ముఖం, శరీరాన్ని నిమిరాడన్నారు. అది భరించలేక తాను ఆయనపై అరిచానని.. స్క్రిప్టు ను వివరించండి అని గట్టిగా చెప్పానంటూ.. తాను ఆవిధంగా చేయకపోతే.. అత్యాచారం చేసేవాడేమోనని ఆమె వ్యాఖ్యానించారు. ఆ లోపే ఆయన భార్య కూడా కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. అనంతరం ఆయన ఆ పనులు మాని స్క్రిప్టును వివరించాడన్నారు.
సీరియల్ లో నటించడానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయాల్సి వుండడం, ఛానల్ ప్రతిష్ఠకు భంగకరమని భావించి ఈ విషయాన్ని ఆ సమయంలో బహిర్గతం చేయలేదని అమె తెలిపారు. రూపాంజన ఆరోపణలను దర్శకుడు అరిందం సిల్ ఖండించారు. ఇదేదో రాజకీయంలా కనిపిస్తోందన్నారు. తామిద్దరం పాత స్నేహితులమని.. తాను వేధించానని చెప్పిన రోజు రూపాంజన తనకు మెసేజ్ చేసిందన్నారు. తాను వేధిస్తే.. ఆమె ఎందుకు సందేశం పంపుతుందని ప్రశ్నించారు. అరిందం పలు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.