: ఆ హత్యతో సంబంధం లేదంటున్న కడియం
టీఆర్ఎస్ నుంచి సస్సెన్షన్ కు గురైన రఘునందన్ బాధితుల్లో సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా చేరారు. రఘునందన్ రెండ్రోజుల క్రితం కడియంపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ మండలంలో పరశురాములు అనే వ్యక్తి హత్యతో కడియంకు సంబంధం ఉందని బాంబు పేల్చారు. ఈ ఆరోపణలపై కడియం నేడు వివరణ ఇచ్చారు. ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ సౌమ్యశీలి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
తనపై వచ్చిన హత్యారోపణలపై స్పందించడానికి తనకు మూడు రోజుల సమయం పట్టిందన్నారు. ఈ వ్యవధిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎందుకు మరణించాడు? అన్న వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. 2003లో స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడ గ్రామంలో పరశురాములు అనే వ్యక్తి టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడని.. అతనిపై రాజకీయ కక్షలతో సీపీఎం కార్యకర్తలు హత్య చేశారని కడియం వివరించారు.
ఇప్పగూడ గ్రామం స్టేషన్ ఘన్ పూర్ మండలంలో ఉన్న జనగాం నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని తెలిపారు. తనకు ఆ హత్యతో సంబంధం ఉందని ఆరోపించడం రఘునందన్ అజ్ఞానానికి నిదర్శమని విమర్శించారు.