: నిర్భయ ఫండ్ ఎక్కడ?
తాబేలు నడక గురించి వివరంగా చెప్పాల్సిన పనిలేదు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ తాబేలు గంటకు కిలోమీటరు దూరం కూడా నడవలేదు. సరిగ్గా మన పాలనావ్యవస్థ పనితీరు కూడా అలాగే ఉంది. ఒకవేళ వేగంలో పోటీపెడితే తాబేలే గెలుస్తుందేమో!
ఇంతకీ విషయం ఏమిటంటే ఆర్థిక మంత్రి చిదంబరం గారు మహిళల రక్షణ కోసం 1000కోట్ల రూపాయలతో నిర్భయ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఆయన ప్రకటించి 50 రోజులు కావస్తోంది. ఢిల్లీలో గతేడాది డిసెంబర్లో పాశవిక అత్యాచారానికి బలైపోయిన జ్యోతి సింగ్ అలియాస్ నిర్భయ సంస్మరణార్థం ఈ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈ ఫండ్ ఎందుకోసం వెచ్చించాలి? ఎవరు పర్యవేక్షించాలి? అన్న విషయాలపై స్పష్టత లేదు. నిధుల వినియోగ బాధ్యతల అప్పగింత జరగలేదు. విధి విధానాల్లేవు. ఇదీ మన పాలనా వ్యవస్థ తీరు!