Chandrababu: ఏమిటీ అమానుషత్వం? ఏమిటీ నిరంకుశధోరణి?: చంద్రబాబు నాయుడు ధ్వజం
- రైతులు భూములు కోల్పోయారు
- 13 రోజులుగా నిద్రాహారాలు మానారు
- వేలాది మంది రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు
- ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
భూములు కోల్పోయి, 13 రోజులుగా నిద్రాహారాలు మాని వేలాది రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. పోలీసులతో అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకించి రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. మహిళలు, వృద్ధులను భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటి? ఏమిటీ అమానుషత్వం? ఏమిటీ నిరంకుశధోరణి? అని నిలదీశారు.
రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం అభియోగాలా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వారేమైనా మీలా గూండాలా? దొంగలా? జరిగిన ఘటనలకు, పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా? అని నిలదీశారు. ఇంత చేతకాని, నిరంకుశ ప్రభుత్వాన్ని దేశం ఇంతవరకూ చూడలేదని ఆయన విమర్శించారు. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణచేయాలనుకోవడం మూర్ఖత్వమని ట్వీట్లు చేశారు.