Andhra Pradesh: రాజధాని ఎంపికపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు: ఏపీ మంత్రి బుగ్గన
- ప్రజాభిప్రాయం పేరిట 1400 మంది అభిప్రాయాలు తీసుకున్నారు
- శివరామకృష్ణ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనీయలేదు
- కొత్తగా నారాయణ కమిటీని ఏర్పాటు చేశారు
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ లో వాడీవేడిగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభలో ప్రస్తావించిన అంశాలపై అధికార పార్టీ సభ్యులు తూర్పారబట్టారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మట్లాడుతూ.. ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు పేపర్లు వెతుక్కుంటున్నారన్నారు. ఆయన అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతిపై అసలే మాట్లాడలేదన్నారు. చివర్లో మీడియాకోసం అమరావతి పేరును ప్రస్తావించారన్నారు.
60 ఏళ్లు అందరం కలిసి కట్టుగా కష్టపడి హైదరాబాద్ ను ఆర్థిక శక్తి కేంద్రంగా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. విభజన అనంతరం మనకు కొన్ని సవాళ్లు ఏర్పడ్డాయన్నారు. ఒక్క వ్యవసాయంమీదే ఆధారపడే పరిస్థితి ఇక్కడ ఏర్పడిందన్నారు. కొత్త రాష్ట్రంలో ఏడు జిల్లాలుకుపైగా ప్రాంతాలు విపరీతంగా వెనకబడ్డాయన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనేది అప్పటి ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలని బుగ్గన తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఉన్న ఏపీ అభివృద్ధికి తొలి పది సంవత్సరాలే కీలకమన్నారు. రాజధాని ప్రాంత నిర్ణయంపై శివరామకృష్ణతో కూడిన నిఫుణుల కమిటీ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడమటుంచీ.. కొత్తగా నారాయణ కమిటీని వేసుకున్నారని టీడీపీని దుయ్యబట్టారు.
శివరామకృష్ణ కమిటీ మేధావులతో కూడిన కమిటీ కాగా, నారాయణ కమిటీ వ్యాపారస్తులతో కూడిన కమిటీ అని బుగ్గన పేర్కొన్నారు. రాజధాని ప్రాంత నిర్ణయంపై ప్రజాభిప్రాయం పేరిట కేవలం 1400 మంది ప్రజల అభిప్రాయాలను ఫోన్ల ద్వారా తీసుకున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే కేవలం 1400 మంది అభిప్రాయాలను ఎలా తీసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు.