: చరిత్ర సృష్టించిన సౌదీ మహిళ
ఆకాశాన్నంటుతున్నట్టుండే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఓ సాహసమే. పైకి వెళ్ళేకొద్దీ, ఇబ్బంది పెట్టే ప్రతికూల వాతావరణం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి సమున్నత శిఖరరాజాన్ని ఓ మహిళ అధిరోహిస్తే.. నిస్సందేహంగా అది అద్భుతమే. రాహా మొహార్రక్.. ఈ అరబ్బీ పడతి ఎంతో శ్రమకోర్చి ఎవరెస్ట్ ఎక్కేసింది. తద్వారా, సౌదీ అరేబియా నుంచి ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.
ఇటీవలే రాహాతో పాటు మరో ముగ్గురు ఓ బృందంలా ఏర్పడి ఈ హిమగిరిని అధిరోహించారు. వారిలో ఓ పాలస్తీనా జాతీయుడు, ఖతార్ వ్యక్తి కూడా ఉన్నారు. వీరందరూ కూడా వారి దేశాల తరుపున ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తులుగా రికార్డు పుటల్లోకెక్కారు. ఈ బృందం నేపాల్ లో విద్యాభివృద్ధి ప్రాజెక్టు కోసం 1 మిలియన్ డాలర్లు సేకరించే ఉద్ధేశంతో ఈ సాహసఘట్టానికి తెరదీశారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించే ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన రాహా ఇలాంటి కార్యానికి నడుంకట్టడం నిజంగా గ్రేట్ కదూ.