Jagan: చిన్నారి హేమ ఆరోగ్య పరిస్థితిపై వార్తా పత్రికల్లో కథనాలు.. స్పందించిన ముఖ్యమంత్రి జగన్!
- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన హేమ (4)కు కేన్సర్
- కళ్లు కోల్పోయిన చిన్నారి
- సాయం అందించాలని అధికారులను ఆదేశించిన జగన్
- నిరుపేదలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంక గ్రామం దోశాలమ్మకాలనీలో కళ్లకు కేన్సర్ సోకిన చిన్నారి హేమ (4) అనారోగ్యంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్పందించారు. వార్తా పత్రికల్లో ఇటీవల హేమ పరిస్థితిపై కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన జగన్.. వారి కుటుంబ వివరాలన్నీ తెలుసుకొని, సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు.
కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలైనా, ఏ పరిమితులు లేకుండా చికిత్స చేయాలని జగన్ సూచించారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయి సంస్కరణలతో అమలు అవుతుందని, ఈ లోగా అత్యవసర కేసులుంటే చికిత్సలు అందించాలని చెప్పారు. కాగా, దోశాలమ్మ కాలనీకి చెందిన భీమిని దుర్గాప్రసాద్ కూతురు హేమ. ఆమె కళ్లకు కేన్సర్ సోకడంతో ఇటీవల హైదరాబాద్లోని ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. చికిత్సలో నేత్రాలను తొలగించడంతో చూపును కోల్పోయింది. అంతేకాదు, కేన్సర్ మిగిలిన శరీరంపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడింది.