NDA: ఎన్డీయే సమావేశానికి మేము హాజరుకావడం లేదు: శివసేన
- సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు
- రేపు భేటీ కానున్న ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు
- తాము హాజరుకాబోమని ప్రకటించిన సంజయ్ రౌత్
సోమవారం నాడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో, రేపు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి శివసేన దూరంగా ఉండబోతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో భేటీ అనంతరం ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీయే సమావేశానికి తాము హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ సజావుగానే సాగుతోందని చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలకు సంబంధించి కనీస ఉమ్మడి ప్రణాళికను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో రేపు శరద్ పవార్ భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశానికి ఉద్ధవ్ థాకరే హాజరుకావడం లేదని తెలుస్తోంది.