aasaanji: నిర్బంధాన్ని కొనసాగిస్తూ అసాంజే ప్రాణాలు హరించాలని చూస్తున్నారు!: యూఎన్ మానవహక్కుల నిఫుణుడు నీల్స్ మెల్జర్

  • జైలు శిక్ష పూర్తయినా.. నిర్బంధంలో కొనసాగిస్తారా ?
  • ఒంటరితనం, నిఘాలతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది
  • ఆయనకు న్యాయ సహాయం అందడం ప్రాథమిక హక్కు

అగ్ర దేశాలకు చెందిన పలు రహస్య పత్రాలను వికీలీక్స్ పేరిట విడుదల చేస్తూ సంచలనం సృష్టించిన విజిల్ బ్లోయర్ జూలియన్ అసాంజే ప్రస్తుతం నిర్బంధంలో ఉంటూ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. తన వికీలీక్స్ తో అగ్ర దేశాలైన బ్రిటన్, అమెరికాలను వణికించిన అసాంజేపై ఆ దేశాలు కక్షగట్టాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిఫుణుడు నీల్స్ మెల్జర్ ఆందోళన వెలిబుచ్చారు.  

అమెరికా వికీలీక్స్ పై 2010లోనే  క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. అదే ఏడాది యూకే ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసినప్పటికీ వెంటనే అసాంజే బెయిల్ పొందారు. 2012లో ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆయన శరణార్థిగా ఆశ్రయం పొందారు. ఏప్రిల్ 11, 2019లో ఈక్వెడార్ అసాంజే కిచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఆయనను యూకే పోలీసులు అరెస్టు చేసి లండన్ జైలులో ఉంచారు.

జైల్లో ఉన్న అసాంజేను మే9న కలిశానని, ఆయన ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోందని మెల్జర్ పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ ఆయనను కలవలేదని చెప్పారు. అయినప్పటికీ, అసాంజే ఆరోగ్యంపై తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని తెలిపారు.

 ‘నాకు అందిన సమాచారం ప్రకారం ఒంటరితనం, నిఘా తదితర నిర్బంధ చర్యలతో అసాంజే తీవ్ర ఆందోళన, ఒత్తిడి, నిస్సహాయతకు గురవుతున్నారు. ఆరోగ్యం క్షీణిస్తోంది. పరిస్థితి మారకుంటే ఆయనకు గుండె, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అసాంజే యూకేలో జైలుశిక్ష పూర్తయినప్పటికి.. తమ గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించాడంటూ అమెరికా ఆరోపిస్తూ ఉండడం వల్ల నిర్బంధాన్ని కొనసాగిస్తూ, ప్రాణాలు హరించాలని చూస్తున్నారు’ అని మెల్జర్ ఆరోపించారు. అగ్రదేశమైన అమెరికాను ఎదుర్కొంటున్న అసాంజేకు న్యాయ సహాయం అందడం కనీస ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News