Telugudesam: దీపావళి రోజునా కార్మికుల బ్రతుకులు చీకటి పాలు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
- ఏపీలో ఇసుక కొరతపై విమర్శలు
- కార్మికుల కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు
- కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయరే?
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వం తీరును తూర్పారబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోందని, కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయకుండానే, ఉన్న విధానాన్ని రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యను రోజురోజుకీ క్లిష్టం చేశారని, ముప్పై లక్షలకు పైగా కార్మిక కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. అనాలోచిత నిర్ణయాలు, అవినీతి పోకడలతో రోజు కూలీలకు, నిర్మాణ రంగ కార్మికులకు దసరా పండగ లేకుండా చేశారని, ఆఖరికి, దీపావళి రోజున కూడా కార్మికుల బ్రతుకులు చీకటి పాలు చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.