: ఇకపై నయనానందకరంగా కోనేటి రాయుడి పాద దర్శనం
తిరుమల కలియుగ వేంకటేశ్వరుడి పాదాలను ఇకపై కనులనిండుగా దర్శించుకునే అవకాశం కలుగనుంది. సాధారణంగా రోజంతా స్వామి పాదాలు బంగారు కవచాలతో కప్పబడి ఉంటాయి. వాటిపై పూలు, తులిసిరేకులు కూడా నిండుగా ఉంటాయి. ఉదయం సుప్రభాత సేవా సమయంలో మాత్రమే పూలు, తులసిరేకులు లేకుండా బంగారు పాదాలను దర్శించుకునే అవకాశం ఉంది.
అయితే ఇక ప్రతీ శుక్రవారం వేకువ జామున స్వామి పాదాలకు ఉన్న బంగారు కవచాన్ని తొలగించి అభిషేకిస్తారు. అనంతరం నిజపాదదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు దర్శనం ఉంటుంది. వీరిని రాములవారి మేడ వరకూ అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి స్వామి 17 అడుగుల దూరంలో ఉండడం వల్ల పాదాలు సరిగా కనిపించడం లేదంటూ భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో వీరిని శయనమండపం వరకూ అనుమతించి స్వామి పాదాలను మరింత దగ్గరగా దర్శించుకునే అవకాశం కల్పించాలని టీటీడీ ఈవో సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారు.