seeman: రాజీవ్‌గాంధీని అందుకే మట్టుబెట్టామన్న ఎన్టీకే చీఫ్.. తమిళనాడులో ఉద్రిక్తత
- శాంతి పేరుతో శ్రీలంకతో రాయబారం
- భారత దళాలను శ్రీలంకకు పంపి మావారిని హతమార్చారు
- అందుకే తమిళగడ్డపైనే రాజీవ్‌ను మట్టుబెట్టామన్న సీమాన్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యపై నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) చీఫ్ సీమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎల్టీటీఈ సానుభూతిపరుడైన సీమాన్ తమిళనాడులోని నాంగునేరి, విక్రవాండి, పుదుచ్చేరిలోని కామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి ఒప్పందం పేరిట శ్రీలంకతో రాజీవ్ గాంధీ రాయబారం నడిపినందుకు తామే హత్య చేశామని పేర్కొన్నారు. భారత దళాలను శ్రీలంకకు పంపి తమ వారిని హతమార్చిన రాజీవ్‌ను తమిళ గడ్డపైనే హతమార్చినట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి.
సీమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు చెన్నైలోని సీమాన్ ఇల్లు, పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, రాజీవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీమాన్‌పై దేశద్రోహం కేసును నమోదు చేశారు.