: యూపీఏలో ప్రధానే సర్వశక్తిమంతుడు: దిగ్విజయ్
యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగే సర్వోన్నత శక్తిమంతుడని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఒక్కసారి కూడా పాలన వ్యవహారాల్లో వేలుపెట్టలేదని ఆయన చెప్పారు. కేంద్రంలో మన్మోహన్, సోనియా మధ్య విభేదాలున్నాయని వార్తలొచ్చిన నేపథ్యంలో దిగ్విజయ్ తాజా వివరణ ఇచ్చారు. పైగా కేంద్రంలో రెండు శక్తి పీఠాలున్నాయన్న వార్తలకు ఆయన తనదైన శైలిలో భాష్యం చెప్పారు. ప్రధాని మన్మోహన్ పాలనా వ్యవహారాలు చూసుకుంటే, సోనియా పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తారని వివరించారు. మన్మోహన్ నిర్ణయాలు ప్రభుత్వపరమైనవనీ, సోనియా నిర్ణయాలు సంస్థాగతమైనవనీ దిగ్విజయ్ పేర్కొన్నారు.