Telugudesam: టీడీపీ నేతల దీక్షను అడ్డుకోవడం మరో అరాచకం: చంద్రబాబునాయుడు
- ప్రజా ఆందోళనలను అణచివేయడం సబబు కాదు
- సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టండి
- కేసులు బనాయిస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయా?
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ నేతలు చేపట్టిన ముప్పై ఆరు గంటల దీక్షను భగ్నం చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి పేదల పొట్ట కొట్టడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న 36 గంటల దీక్షను అడ్డుకోవడం మరో అరాచకమని విమర్శించారు.
ప్రజా ఆందోళనలను అణచివేయడంపై పెట్టే శ్రద్ధలో పదో వంతు పేదల సమస్యల పరిష్కారంపై పెడితే ఈ దుస్థితి ఉండదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. విశాఖపట్టణంలో తమ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణలపై కేసులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అక్రమ కేసులు పెడితే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయా? అని నిలదీశారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.