: మూలికలతో కేన్సర్ నయం చేస్తానని.. మూల్యం చెల్లించుకుంది!


బాలికకు సోకిన కేన్సర్ ను నయం చేస్తానని చెప్పి ఆమె చావుకు కారణమైన ఓ అమెరికా డాక్టర్ మూల్యం చెల్లించుకుంది. లాస్ ఏంజెల్స్ లో బ్రయానికా కిర్ష్ అనే బాలిక మూడేళ్ళ వయసులో బ్రెయిన్ కేన్సర్ బారిన పడింది. కీమోథెరపీతో పాటు శస్త్రచికిత్సలు చేయించినా ఫలితం లేకపోవడంతో.. బాలిక తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ వైద్య విధానాలవైపు దృష్టి సారించారు.

ఆ సమయంలో మూలికా ఔషధాలతో వైద్యం చేస్తానంటూ డా. క్రిస్టినే డానియెల్ వీరిని ఆకర్షించింది. అయితే, వీరి వద్ద నుంచి వందల కొద్దీ డాలర్లు ఫీజుల రూపంలో వసూలు చేసిన సదరు డాక్టర్ వ్యాధిని నయం చేయడంలో దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే బ్రయానికా మృత్యువాత పడింది.

దీంతో, డాక్టర్ క్రిస్టినే చేతిలో తాము మోసపోయామని భావించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడా కేసులో చీటింగ్ డాక్టర్ కు 27 ఏళ్ళ జైలు శిక్ష పడేలా తీర్పు ఇవ్వాలని ప్రాసిక్యూటర్లు ఫెడరల్ కోర్టుకు విన్నవించారు. ఏదేమైనా ఆమెకు మాత్రం జైలుశిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది. పన్ను ఎగవేత, సాక్ష్యాలు తారుమారు చేయడం వంటి ఆరోపణలపై ఆ డాక్టర్ పై 2011లోనూ పలు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News