: అనుమానిత హిజ్బుల్ తీవ్రవాదికి బెయిల్
దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ళకు ప్రణాళిక రచించాడంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న కాశ్మీర్ వ్యక్తి సయ్యద్ లియాఖత్ కు బెయిల్ మంజూరైంది. రూ. 20 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ ను ఢిల్లీ సిటీ కోర్టు నేడు మంజూరు చేసింది. న్యాయస్థానం.. లియాఖత్ కు భారత్ వదిలి వెళ్ళరాదన్న షరతు విధించింది. అంతేగాకుండా, నివాస స్థలాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మార్చవద్దంటూ, ప్రతి నెల కాశ్మీర్లోని కుప్వారా పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది.
పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్ లో ప్రవేశించాడని, ఢిల్లీలో ముంబయి తరహా విధ్వంసానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ.. ఢిల్లీ పోలీసులు లియాఖత్ ను గత మార్చి 20 ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఏకే-56 రైఫిల్ తోపాటు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాశ్మీర్ ప్రభుత్వం మాత్రం.. లియాఖత్ తీవ్రవాదాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడని చెప్పింది. తాము ప్రకటించిన తీవ్రవాద పునరావాస పథకానికి ఆకర్షితుడై అతను ఆయుధాలతో సహా లొంగిపోయేందుకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది.