Jagan: జగన్ 100 రోజుల పాలనపై 4 పేజీల బ్రోచర్ విడుదల చేసిన టీడీపీ
- గుంటూరులో టీడీపీ సీనియర్ల మీడియా సమావేశం
- వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగిన యనమల, కళా
- ఏపీ ఆదాయం తగ్గి తెలంగాణ ఆదాయం పెరుగుతోందన్న యనమల
వైసీపీ 100 రోజుల పాలనలో 125 తప్పులు అంటూ టీడీపీ ఓ బ్రోచర్ విడుదల చేసింది. గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ సీనియర్లు 4 పేజీల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.
100 రోజుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించడం జగన్ కే చెల్లిందని యనమల వ్యాఖ్యానించారు. విపక్షాలపై కక్ష తీర్చుకోవడమే ఆయన లక్ష్యం అని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, ఏపీ ఆదాయం తగ్గి తెలంగాణ ఆదాయం పెరుగుతోందని, ఈ పరిస్థితికి జగనే బాధ్యుడని విమర్శించారు.
అనంతరం కళా వెంకట్రావు మాట్లాడుతూ, అరాచకాలు, దాడులు తప్ప ఈ 100 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఏంచేసిందని నిలదీశారు. 300 తప్పులు, 600 రద్దులు చేశారంటూ మండిపడ్డారు.