Andhra Pradesh: జగన్ వందరోజుల పాలనపై చంద్రబాబు నూటొక్క కుట్రలు చేశారు: వైసీపీ నేత సి.రామచంద్రయ్య
- పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ సర్కార్ పై బురద జల్లిస్తున్నారు
- రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం చేస్తున్నారు
- టీడీపీ నేతలను హత్య చేశారన్న ఆరోపణలు తగదు
తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినట్లేనని, ఏపీలోనూ ఖాళీ కాబోతోందని వైసీపీ నేత సి.రామచంద్రయ్య జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మరో ముప్పై ఏళ్లపాటు వైసీపీ అధికారంలో ఉంటుందని భావించిన చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని అన్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై చంద్రబాబు వంద అబద్ధాలు, 101 కుట్రలు చేశారని, టీడీపీ నేతలను హత్య చేశారని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు కొంతమందికి డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నారని, గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి జగన్ ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ వందరోజుల ప్రజా సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బాబు డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.