Mumbai: బాలికతో తల్లిదండ్రులే దగ్గరుండి వ్యభిచారం చేయించిన దారుణ ఘటన!
- సభ్యసమాజం తలదించుకునే ఘటన
- బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించిన కుటుంబసభ్యులు
- ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు
అభంశుభం తెలియని మైనర్ బాలికకు వివాహం చేశారా తల్లిదండ్రులు. అంతవరకూ ఓకే. దేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నదే. కానీ, ఆపై, ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. దగ్గరుండి రోజూ హింసిస్తూ, నరకకూపాన్ని చూపారు. ఆమె సోదరుడు కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ముంబైలో జరిగింది. బాలిక ఫిర్యాదుతో కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదలబోమని అంటున్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, మాన్ ఖర్థ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ జంట, తమ బిడ్డకు 15 సంవత్సరాల వయసులో 35 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. అతనితో జీవితం గడపడం ఇష్టంలేని బాలిక, ఇంటికి తిరిగి రాగా, ఆమెను అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించాలని భావించారు. కుటుంబ పోషణ నిమిత్తం వ్యభిచారం చేయాలని కన్న తల్లిదండ్రులు, సోదరుడు బలవంతపెట్టారు. ఆమెను మురికికూపంలోకి దించారు.
కొంతకాలం వారి వేధింపులు భరించిన ఆమె, ఇక తాళలేక, పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని బలవంతపెడుతున్నారని వాపోయింది. తోడబుట్టిన వాడు కూడా తనను వదల్లేదని ఆమె చెప్పడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. విచారణ ప్రారంభించి, ఆమె తల్లిదండ్రులను, సోదరుడిని, భర్తను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపారు. నిందితులపై ఫోక్సో చట్టంతో పాటు మైనర్ బాలికల వివాహ నిషేధిత చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని అన్నారు.