: మళ్లీ దిగొస్తున్న బంగారం
నెల క్రితం బంగారం ధర 10 గ్రాములకు 25వేల రూపాయల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కోలుకుని 28,500 స్థాయికి చేరుకుంది. అక్కడ కొన్ని రోజులపాటు నిలబడిన తర్వాత మళ్లీ బంగారం ధర జారుతూ వస్తోంది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 26,900 వద్ద ముగియగా.. ఈ రోజు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్(31గ్రాములు) 1382 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
డాలర్ క్రమంగా బలపడుతుండడమే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ బలహీన పడుతున్న దశలో భద్రత కోసం ఇన్వెస్టర్లతో బాటు, దేశాలు కూడా బంగారంపై పెట్టుబడి పెడతాయి. డాలర్ బలపడుతుంటే దీనికి విరుద్ధంగా ఉంటుంది. డిమాండ్ తగ్గడం కూడా ధరలు తగ్గడానికి ఒక కారణమంటున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే మళ్లీ పసిడి ధర మొన్నటి కనిష్ఠ స్థాయిని మరోసారి తాకే అవకాశం ఉందని, అమ్మకాలు వెల్లువెత్తితే ఇంకా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. కనుక ఈ దశలో కొనుగోలుకు తొందరపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.