: ఇక త్రీడీ చిత్రాలు ఈజీనే...
త్రీడీ చిత్రాలను తీయాలంటే సంప్రదాయ డిజిటల్ కెమెరాలు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా చక్కగా త్రీడీ చిత్రాలను తీయొచ్చంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అదికూడా మామూలు చవకగా దొరికే డిటెక్టర్లతోనే ఇది సాధ్యమంటున్నారు. గ్లాస్‌గో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అరుదైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. తాము కనుగొన్న ఈ పరిజ్ఞానంతో ముందుముందు మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతోనే త్రీడీ చిత్రాలను తీయొచ్చంటున్నారు.
ఈ త్రీడీ చిత్రాల నిర్మాణం గురించి వారు చెబుతూ 'ప్రొజెక్టర్ల నుండి కాంతిని గుర్తించేందుకు ఒక పిక్సెల్‌తో కూడిన నాలుగు డిటెక్టర్లను వేర్వేరు చోట్ల అమర్చామని, ప్రొజెక్టర్ పదకేళి చదరాల వంటి నలుపు, తెలుపు ఆకారాల క్రమంలో చాలా వేగంగా వస్తువులపై కాంతిని ప్రసరింపజేస్తుందని' ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మైల్స్ ప్యాడ్జెట్ తెలిపారు. తెలుపు చదరాల ఆకారాలు పెద్ద మొత్తంలో ఒకదానిపై మరొకటి ఆవరించుకున్నప్పుడు డిటెక్టర్లపై తిరిగి ప్రతిఫలించే కాంతి మొత్తం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ప్రొజెక్టర్లనుంచి వెలువడిన కాంతి వస్తువులపై పడినప్పుడు ఏర్పడ్డ ఆకారాల క్రమం, ఆ ఆకారాల నుండి డిటెక్టర్లకు చేరుకునే కాంతి ఆధారంగా కంప్యూటర్ సాయంతో ముందు 2డీ చిత్రాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత దానినుండి 3డీ చిత్రాన్ని రూపొందిస్తారు. ఈ పరిశోధన మరింత మెరుగుపడితే మున్ముందు తక్కువ ఖర్చుతోనే త్రీడీ చిత్రాలను చక్కగా తీసేయొచ్చు...!