Telangana: కాపురంలో ‘హెన్నా’ చిచ్చు.. భర్త మాటలకు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన భార్య!
- హైదరాబాద్ లోని చిలకలగూడలో ఘటన
- భార్య తలకు హెన్నా పెట్టుకుంటుండగా ప్రశ్నించిన భర్త
- ఇప్పుడు అవసరమా? అనడంతో భార్య మనస్తాపం
భార్యాభర్తలు అన్నాక సర్దుకుపోవాలి. అంతేకానీ ఓ మాట అన్నారని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే కుటుంబం మొత్తం బాధపడాల్సి ఉంటుంది. తాజాగా ఓ భర్త చిన్న మాట అనడంతో మనస్తాపానికి గురైన భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ నెల 8న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలోని హన్మకొండ కాజీపేటకు చెందిన షేక్ ఒమర్, సమీనా(28) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి కోసం ఈ కుటుంబం ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ లోని చిలకలగూడ చింతబావి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 8న సమీనా తలకు హెన్నా పెట్టుకుంటుండగా, అప్పుడే ఇంటికి వచ్చిన ఒమర్..‘ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు.. ఇప్పుడు తలకు హెన్నా పెట్టుకోవడం అవసరమా?’ అని ప్రశ్నించాడు.
ఈ సందర్భంగా దంపతుల మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో తీవ్రమనస్తాపానికి లోనైన సమీనా ఇంట్లో కిరోసిన్ ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సందర్భంగా ఆమె అరుపులు విన్న ఒమర్, ఇరుగుపొరుగువారు మంటలను ఆర్పివేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, 90 శాతం కాలిన గాయాలైన సమీనా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.