Andhra Pradesh: నాకు ఏదైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు..చీకటిరోజు
- రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా?
- ప్రభుత్వం నాకు సరైన రక్షణ ఏర్పాట్లూ చేయట్లేదు
వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు.. చీకటిరోజు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని రుద్రమాంబపురంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ మహిళా కార్యకర్త పద్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తమ కార్యకర్త పద్మను వివస్త్రను చేసి సెల్ ఫోన్ లో చిత్రీకరించడం దారుణమని, దోషులు కళ్ల ముందే తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా వందకుపైగా ఘటనలు జరిగాయని, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారని, ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదని, ‘ఇదంతా మామూలే’ అని హోం మంత్రి సుచరిత అంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వం ఏం చేయలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తనకు భద్రత కుదించడంపై చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం తనకు సరైన రక్షణ ఏర్పాట్లూ చేయడం లేదని విమర్శించారు. తనకు ఏదైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.