: ఆ ఇద్దర్నీ శ్రీశాంతే మేనేజ్ చేశాడు: ఢిల్లీ పోలీసులు
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ నేతృత్వంలోనే స్పాట్ ఫిక్సింగ్ సాగిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మే 9న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ మ్యాచ్ లో ఓ ఓవర్ లో 20 పరుగులిస్తే రూ.60 లక్షలు ఇస్తామని బుకీలు ఆఫర్ చేయడంతో శ్రీ ఇందుకు ఒప్పుకున్నాడని వారు చెప్పారు.
కాగా, ఈ కుంభకోణంలో అరెస్టయిన మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు చండిలా, అంకిత్ చవాన్ లు ఫిక్సింగ్ లో పాల్గొనేలా శ్రీశాంతే ఒప్పించాడని చెప్పారు. క్రికెటర్లు బుకీలకు మైదానంలో నుంచే సైగల ద్వారా మ్యాచ్ తీరుతెన్నులు వివరించేవారని పోలీసులు తెలిపారు. తాము వేసే బంతికి ఎన్ని పరుగుల వస్తాయో సంజ్ఞల ద్వారా చెబితే, బుకీలు ఆ సమాచారంతో బెట్టింగ్ నిర్వహించేవారని వివరించారు.కాగా, ఇతర ఆటగాళ్ళ ప్రమేయం ఉన్నట్టు తమ విచారణలో తేలలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ఇప్పటివరకు ముగ్గురు క్రికెటర్లను 11 మంది బుకీలను అరెస్టు చేశామని కమిషనర్ తెలిపారు.