: సరబ్ జిత్ న్యాయవాది సురక్షితం


దివంగత భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ న్యాయవాది అవైస్ షేక్, అతని కుమారుడు షారూఖ్ లను ఈ ఉదయం కిడ్నాప్ చేసిన దుండగులు వారిని విడిచిపెట్టారు. పాకిస్తాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో గాయపడిన సరబ్ జిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, గతకొంతకాలంగా సరబ్ జిత్ కేసును వాదిస్తోన్న అవైస్ షేక్ ను ఈ ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.

ఆయన తన కుమారుడు షారూఖ్ తో కలిసి బుర్కీ హైదరా గ్రామం వద్ద ఫామ్ హౌస్ కోసం భూమి కొనుగోలు చేసేందుకు వెళ్ళగా.. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని కిడ్నాప్ చేశారు. అవైస్ మరో కుమారుడు హరూన్.. తన తండ్రి, సోదరుడిని దుండగులు ట్రక్ లో వేసుకుని వెళ్ళారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఓ వైపు గాలింపు చర్యలు చేపడుతుండగా.. ఓ గంటన్నర తర్వాత కిడ్నాపర్లు న్యాయవాది, అతని కుమారుడిని ఓ జాతీయ రహదారిపై వదిలి వెళ్ళిపోయారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమపై అగంతకులు దాడి చేశారని అవైస్ తెలిపారు. కాగా, సరబ్ జిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అవైస్ కుటుంబానికి పలు బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన్ను కిడ్నాప్ చేసింది ఎవరన్న విషయం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News