Hyderabad: ప్రియుడ్ని ఉద్ధరించడానికి డ్రగ్స్ అమ్ముతున్న హైదరాబాద్ అమ్మాయి
- తొమ్మిదేళ్లుగా ఇదే దందా
- నైజీరియన్లతో లింకులు
- అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బంది
ఓ అమ్మాయి తన ప్రియుడి కోసం ఎంతకు తెగించిందో చూడండి! హైదరాబాద్ కు చెందిన ఓ యువతి తన ప్రియుడ్ని సంతోష పెట్టేందుకు డ్రగ్స్ దందాలో అడుగుపెట్టింది. హైదరాబాద్ లో ప్రముఖులు ఎక్కువగా నివాసం ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు మొదలుపెట్టింది. కొందరు నైజీరియన్లతో ఒప్పందం కుదుర్చుకుని వారి నుంచి తక్కువ ధరకే మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేది. ఆపై వాటిని అధిక ధరలకు ఖరీదైన కస్టమర్లకు విక్రయించేది.
అయితే, పక్కా సమాచారంతో వలపన్నిన ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆ యువతిని, ఆమె ప్రియుడ్ని పట్టుకున్నారు. ఆమె నుంచి 9 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గత తొమ్మిదేళ్లుగా తాను డ్రగ్స్ కొనడం, అమ్మడం చేస్తున్నట్టు తెలిపింది. ఇదంతా ప్రియుడి విలాసాల కోసమే అని చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఇక, ఆ యువతికి డ్రగ్స్ చేరవేస్తున్న నైజీరియన్ల పనిబట్టేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.