Jagan: అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు... 10 మంది స్థానికులకు ఉద్యోగాలు!
- ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ తొలి సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- హామీలను నిలబెట్టుకునే దిశగా జగన్ కీలక అడుగులు!
ఎన్నికల సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో చోటు చేసుకున్న అనేక పథకాలకు ఇవాళ నిర్వహించిన క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర పడింది. జగన్ సీఎం అయ్యాక విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఇదే తొలి క్యాబినెట్ సమావేశం. ఇవాళ నిర్వహించిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో గ్రామ సచివాలయాల అంశం కూడా ఉంది. గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన హామీని నిలబెట్టుకునే దిశగా సీఎం హోదాలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గ్రామ సచివాలయాల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం ఓ కమిటీ వేసే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుందని సమాచారం.