Jagan: ప్రాజక్టు వ్యయం 20 శాతం తగ్గించే ఇంజినీర్లకు, అధికారులకు సన్మానం చేస్తా: జగన్
- అవినీతి జరిగితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది
- నాతో వాస్తవాలే చెప్పండి
- అధికారులకు జగన్ స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ ఇవాళ సాగునీటి ప్రాజక్టులపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన జలవనరులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ పోలవరం ప్రాజక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. త్వరలోనే తాను పోలవరం ప్రాజక్టును సందర్శిస్తానని చెప్పారు.
ప్రాజక్టులకు అధికవ్యయం చేసి రాష్ట్ర ఖజానాకు గండికొడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. తన ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని హెచ్చరించారు. అవినీతి జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని తీవ్రస్వరంతో చెప్పారు.
కాంట్రాక్టు పనుల గురించి ఆరాతీసిన జగన్, ప్రాజక్టుల్లోని కొన్ని పనులకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని అధికార వర్గాలకు సూచించారు. అంతేగాకుండా, ప్రాజక్టు వ్యయం 20 శాతం తగ్గించే అధికారులు, ఇంజినీర్లకు సన్మానం చేస్తామని ప్రోత్సాహక వచనాలు పలికారు. అధికారులు, ఇంజినీర్లు తనతో వాస్తవ వివరాలను చెబితేనే బాగుంటుందని జగన్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా, 2014 కంటే ముందు ప్రతిపాదించిన ప్రాజక్టులు, వాటి అంచనాల పెంపుపై నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 6న మరోసారి ప్రాజక్టుల వారీగా సమీక్షలు చేపడదామని, ప్రాజక్టుల చీఫ్ ఇంజినీర్లు తమ అంచనాలను వాస్తవరూపంలో వివరించాలని సీఎం స్పష్టం చేశారు.