Jagan: గుంటూరులో సీఎం జగన్... విజయవాడలో చంద్రబాబు... ఇఫ్తార్ విందులు!
- రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు
- ముస్లింలతో కలిసి జగన్ ప్రార్థనలు
- టీడీపీ ఇఫ్తార్ లో పాల్గొన్న చంద్రబాబు, లోకేశ్
పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి జగన్ ముఖ్యమంత్రి హోదాలో విచ్చేసి, ముస్లిం మతగురువులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనారిటీలను ప్రోత్సహిస్తున్నది వైసీపీయేనని, ఈ ఎన్నికల్లో ఐదుగురు ముస్లిం మైనారిటీలకు టికెట్లివ్వగా వారిలో నలుగురు గెలిచారని, ఓడిపోయిన ఇక్బాల్ ను ఎమ్మెల్సీ చేస్తానని తెలిపారు. రంజాన్ మాసంలోనే తాము అధికారంలోకి రావడం సంతోషదాయకమని చెప్పారు.
మరోవైపు, మాజీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఇఫ్తార్ విందుకు తన కుమారుడు నారా లోకేశ్ సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు కూడా వచ్చారు. చంద్రబాబు తదితరులు ముస్లిం మతపెద్దలతో కలిసి ఇఫ్తార్ దువా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్లుండి రంజాన్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.