Jagan: పోలవరం వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని జగన్ నిర్ణయం
- జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష
- వివరాలు అందజేసిన అధికారులు
- వచ్చేవారం జగన్ పోలవరం పయనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర జలవనరులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటిపారుదల, జలవనరుల విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పోలవరం ప్రాజక్టు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే, తాను ఓసారి పోలవరం వెళ్లి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చేవారం పోలవరం వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
కాగా, పోలవరం వెళ్లడానికి ముందు మరోసారి జలవనరుల శాఖ సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఇవాళ్టి సమీక్షలో జగన్ కు అధికారులు పలు వివరాలు తెలియజేశారు. పోలవరం ప్రాజక్టు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని, వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలమని సీఎంతో చెప్పారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు వెచ్చించిందని, కేంద్రం నుంచి రూ.4,200 కోట్లు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.