Jagan: ఆర్థిక, రెవెన్యూ శాఖల సమీక్షలో నవ్వులు పూయించిన ఏపీ సీఎం జగన్
- ఆర్థిక, రెవెన్యూ శాఖల సమీక్ష నిర్వహించిన జగన్
- తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం
- హాజరైన సీఎస్, ఇతర ఉన్నతాధికారులు
ఏపీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షల ద్వారా అంచనా వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిగా ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశం ఆద్యంతం ఉల్లాసభరితమైన వాతావరణంలో సాగింది. సీఎం హోదాలో తొలిసారి సమీక్ష చేపట్టిన జగన్ తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ అధికారుల మోములో నవ్వులు పూయించారు.
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పీవీ రమేశ్, సాంబశివరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోగ్యరాజ్, అడిషనల్ సెక్రటరీ ధనంజయరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది. జగన్ అధికార వర్గాలతో ఎంతో కలివిడిగా వ్యవహరించి తనకు కావలిసిన సమాచారం రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా జగన్ తో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగినట్టు సమాచారం.