Jagan: సచివాలయ ప్రవేశాన్ని వాయిదా వేసుకున్న ఏపీ సీఎం!
- మంచి ముహూర్తం కోసం చూస్తున్న జగన్
- తాడేపల్లి నివాసం నుంచే పరిపాలన
- ఇంటి వద్దకే వస్తున్న అధికారులు
నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన జగన్ అప్పుడే పరిపాలన షురూ చేశారు. పెన్షన్ ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన దానికి సంబంధించిన జీవోను కూడా తీసుకువచ్చారు. కాగా, ఇవాళ జగన్ వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో అడుగుపెట్టి అక్కడి నుంచే పాలన మొదలుపెట్టాలని భావించారు. కొన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే, సుముహూర్తం లేకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటివద్ద నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు.
ఇంతక్రితమే డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా సీఎం జగన్ ను ఆయన నివాసంలోనే కలుసుకుని చర్చించారు. రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మరికొందరు ఉన్నతాధికారులు కూడా జగన్ ను తాడేపల్లి నివాసంలోనే కలుసుకుని రాష్ట్ర స్థితిగతులపై నివేదికలు సమర్పిస్తారని తెలుస్తోంది.