Jagan: జగన్ తో భేటీ అయిన సీఎస్, ఇతర అధికారులు... ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వివరణ
- అధికారుల వివరణతో జగన్ సంతృప్తి
- రేపు కీలక ప్రకటన చేయనున్న జగన్!
- మరికొన్ని గంటల్లో జగన్ సీఎం
మరికొన్ని గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 23 నిమిషాలకు జగన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను వివరించేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కొద్దిసేపటి క్రితం విజయవాడలో జగన్ ను కలిశారు. ఆయన వెంట ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై అన్ని వివరాలను జగన్ కు నివేదించారు.
ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. అధికారుల వివరణతో జగన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, ఇప్పటికే నవరత్నాల అమలుపై కసరత్తులు ప్రారంభించిన జగన్ రేపు తన ప్రమాణస్వీకారం అనంతరం అదే వేదికపై నుంచి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో సచివాలయానికి వెళ్లనున్న జగన్, ఆ తర్వాత శాఖల వారీగా సమీక్షలు జరిపి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఓ అవగాహనకు రానున్నారు.