Jagan: ఓ దుష్టసామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఎన్నో చేయాలి... అందుకే జగన్ ఆయనతో కలిశాడేమో!: స్వామి స్వరూపానందేంద్ర
- జగన్, కేసీఆర్ కలయికపై ప్రత్యేక కారణం చెప్పలేను
- ప్రభుత్వ భూములు కాపాడుకోవడంపై జగన్ దృష్టి పెట్టాలి
- గత ప్రభుత్వంలాగా అర్చకుల్ని వేధించకూడదు
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలవడానికి కారణం ఇదంటూ తానేమీ చెప్పలేనని, కానీ ఓ దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చాలంటే ఎన్నోరకాల ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందని, జగన్, కేసీఆర్ కలయిక కూడా అలాంటిదే అయ్యుండొచ్చని స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి ఇక రాష్ట్రపాలనపై జగన్ దృష్టి పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం ఇసుక మాఫియాతో అందరినీ భయభ్రాంతులకు గురిచేసిందని, జగన్ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పారు. ముఖ్యంగా, దేవాలయ భూములు పరిరక్షించడంతోపాటు, అర్చకస్వాముల హక్కులను కాపాడాలని స్వామి కోరారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయ అర్చకుల్ని తీవ్ర హింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకుల్ని బాగా చూసుకుంటే వారి దీవెనలే శ్రీరామరక్ష అవుతాయని స్వామీజీ అభిప్రాయపడ్డారు.