Jagan: నాపై కుట్రలు చేశారు కానీ, వారిపై ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడను: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్
- జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఉద్యోగం వదిలేశా
- అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేస్తా
- హిందూపురం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన గోరంట్ల మాధవ్
సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై విజయం సాధించిన మాధవ్ ఎన్నికల బరిలో దిగిన తొలిసారే గెలుపు రుచిచూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ నాయకత్వంలో సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశానని వివరించారు.
తనకు హిందూపురం ఎంపీ టికెట్ రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. అయితే, తనను రాజకీయంగా ఎదగకుండా చేయాలని ప్రయత్నించిన వారిపై ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడబోనని స్పష్టం చేశారు. అపకారం తలపెట్టిన వారికి కూడా ఉపకారం చేస్తానని, నియోజకవర్గంలో ఒక్క రక్తపు చుక్క కూడా నేలపై చిందకుండా పరిపాలన అందించాలన్నదే తన లక్ష్యమని గోరంట్ల మాధవ్ ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో తనకు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌కు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధుల్లో ఉన్న ఒక డీఎస్పీ స్థాయి అధికారి సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరూ చూడండి--