Telangana: వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపిన రామగుండం పోలీసులు..... 49 మంది అరెస్ట్
- రూ.65 లక్షల నగదు స్వాధీనం
- మరో 70 మంది పరారీ
- అనుమతి లేని వ్యాపారం చేస్తే కఠినచర్యలు తప్పవన్న పోలీసులు
రామగుండం పోలీసులు అక్రమంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 49 మంది వడ్డీ వ్యాపారుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.65.52 లక్షల నగదు, 1,235 ప్రామిసరీ నోట్లు, 1019 బ్లాంక్ చెక్కులు, 34 ఏటీఎం కార్డులు, 175 బాండ్ పేపర్లు, 23 ల్యాండ్ డాక్యుమెంట్లు, 9 పట్టాదారు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాలతో వడ్డీ వ్యాపారులు అక్రమ మార్గాల్లో అధిక వడ్డీలకు ఫైనాన్స్ చేస్తూ, పెద్దఎత్తున డబ్బు పోగేసుకుంటున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియాకు తెలిపారు.
ప్రామిసరీ నోట్లే కాకుండా బాండ్ పేపర్లు, ఏటీఎం కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలను తనఖా పెట్టుకుంటూ అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు పిండుకుంటున్నారని వివరించారు. అనుమతిలేని వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. కాగా, పోలీసుల దాడుల నేపథ్యంలో మరో 70 మంది వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నారు.