Andhra Pradesh: జగన్ ఇంట్లో హత్య జరిగితే ఏం చేశారు.. చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు?: ఏపీ సీఎం చంద్రబాబు
- ఈ విషయంలో ఈసీ సమాధానం చెప్పాలి
- మోదీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
కేథార్ నాథ్ పర్యటనకు వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ఈసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో అవసరమైనప్పుడు కేంద్ర సాయుధ బలగాలను పంపలేదని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ రీపోలింగ్ సమయంలో విపరీతంగా కేంద్ర బలగాలను మోహరించారని విమర్శించారు. ఈ మోహరింపునకు ఖర్చయ్యే మొత్తం ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
రూ.9,000 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన వీవీప్యాట్ యంత్రాలు అలంకార ప్రాయంగా మారాయని ఏపీ సీఎం విమర్శించారు. ‘ఫామ్-7 వ్యవహారంలో ఈసీ సహకారం అందించలేదు. ఈ ఓట్ల తొలగింపునకు ఉద్దేశించిన ఈ దరఖాస్తును ఎక్కడి నుంచి అయినా అప్ లోడ్ చేయవచ్చు. ఈ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేశామనీ, సమాచారం ఇవ్వాలని ఈసీని కోరాం. కానీ వాళ్లు స్పందించలేదు. ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి ఎన్నికలకు వచ్చాం. ఐపీ అడ్రస్ ఇవ్వకుంటే న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఈసీ నిబంధనలు విచిత్రంగా ఉన్నాయని టీడీపీ అధినేత అన్నారు.
వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై స్పందిస్తూ..‘జగన్ నివాసంలో హత్య జరిగితే ఏం చేశారు? ఆధారాలు మాయం చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మాజీ సీఈసీ ఖురేషీయే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.