Congress: ఈ టెక్నిక్ ను వాడడంలో బీజేపీ పండిపోయింది: శశి థరూర్
- దేశంలో 82 శాతం వాట్సాప్ వినియోగదారులే
- వాళ్లలో అత్యధికులకు బీజేపీ చేరువ కాగలిగింది
- భవిష్యత్తులో ఎన్నికలు స్మార్ట్ ఫోన్లతోనే జరుగుతాయి
కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్ చేశారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడంలో బీజేపీ ఆరితేరిందని, ఈ టెక్నిక్ ను మిగతా పార్టీల కంటే బీజేపీనే బాగా ఉపయోగించుకుంటోందని అన్నారు.
దేశం మొత్తమ్మీద 82 శాతం ప్రజలు వాట్సాప్ వినియోగిస్తున్నారని, వాళ్లలో అత్యధికులకు చేరువయ్యే మెళకువను బీజేపీ బాగా వంటబట్టించుకుందని తెలిపారు. అధిక సంఖ్యలో ఓటర్లను చేరుకోవడానికి ఈ పంథా ఉపయుక్తంగా ఉందని, భవిష్యత్తులో ఎన్నికలు స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతాయని బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య అన్న మాటలను థరూర్ ఈ సందర్భంగా ఉటంకించారు.