India: ఎన్నికల సంఘంలో బయటపడ్డ లుకలుకలు!

  • సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు బట్టబయలు
  • కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సభ్యుడు అశోక్ లవాసా అసంతృప్తి
  • మోదీ, షాలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సునీల్ ఆరోరాకు లేఖాస్త్రం

దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినా ఈసీపై ఈ స్థాయిలో విమర్శలు ఎప్పుడూ రాలేదు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ వరకు ఏదో ఒక విధంగా ఈసీ బాధితులవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈసీ తీరుపై సాక్షాత్తు సభ్యులే అసంతృప్తితో ఉండడం తాజా పరిస్థితికి నిదర్శనం అని చెప్పాలి. ఎంతో స్వయంప్రతిపత్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అశోక్ లవాసా ఆరోపిస్తున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంలో లవాసాతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, సుశీల్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఈసీ పట్టించుకోకపోగా, వారికి క్లీన్ చిట్ ఇవ్వడంపై లవాసా దిగ్భ్రాంతికి గురయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరు పట్ల అసంతృప్తికి గురైన ఆయన అదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, త్రిసభ్య సంఘంలో మరో సభ్యుడైన సుశీల్ చంద్రకు లేఖ రూపంలో తెలియజేశారు. అంతేకాదు, ఆయన ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు కూడా హాజరుకావడంలేదు.

అరోరాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న మరో సభ్యుడు సుశీల్ చంద్ర తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వారిద్దరూ తన అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని లవాసా తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. కాగా, అశోక్ లవాసా నిర్భీతిగా తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న తీరుకు బీజేపీయేతర పార్టీల నుంచి బహిరంగంగానే మద్దతు లభిస్తోంది.

  • Loading...

More Telugu News