Andhra Pradesh: వివేకా హత్యకేసులో ఎవరా ముగ్గురు కుటుంబ సభ్యులు?... కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారు?: వర్ల
- వివేకా హత్యకేసు విచారణపై వర్ల సందేహాలు
- పోలీసులను అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలంటూ డిమాండ్
- వివేకా హత్యకేసును గాలికొదిలేశారంటూ విమర్శ
ఏపీలో పోలింగ్ కు కొన్నిరోజుల ముందు జరిగిన వైఎస్ వివేకా హత్యకేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడంపై టీడీపీ నేత వర్ల రామయ్య పలు సందేహాలు లేవనెత్తారు. వైఎస్ వివేకా హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్టు ఓ పత్రిక పేర్కొందని, అలాంటప్పుడు ఆ ముగ్గురిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదో సిట్ వెల్లడించాలని వర్ల డిమాండ్ చేశారు.
రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు కావడంతోనే పోలీసులు వెనుకాడుతున్నారంటూ ఆ పత్రికలో వచ్చిందని, రాజకీయ నేపథ్యం ఉంటే ఏంచేసినా పట్టించుకోరా? దారుణంగా హత్య చేసినా వదిలేస్తారా? అంటూ నిలదీశారు. వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో పోలీసులను అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలని సిట్ ను ప్రశ్నించారు. అంతేకాకుండా, వివేకా కుటుంబ సభ్యులను కూడా వర్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మీ కుమారుడిలాంటి జగన్ పులివెందుల వచ్చారు కదా, ఆయనేమైనా వివేకా హత్య కేసు గురించి పోలీసు అధికారులను, సిట్ అధికారులను వాకబు చేశారా? అని అడిగారు. ఎవరో అనామకుడు చనిపోతే వదిలేసినట్టుగా ఎందుకు వివేకా హత్యకేసును గాలికి వదిలేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ మంత్రిగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి సోదరుడు, ఓ పార్టీ అధినేతకు బాబాయి అయిన వ్యక్తి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అని వర్ల మండిపడ్డారు.