UK: నిక్షేపంగా ఉన్న అబ్బాయిని అందమైన అమ్మాయిగా మార్చేసిన యాప్!
- జెండర్ స్వాప్ ఫిల్టర్ తో అమ్మాయి ముఖం
- టిండర్ లో పోస్టు చేసిన యువకుడు
- కొద్ది సమయంలోనే భారీ స్పందన
ఇది స్మార్ట్ యుగం! చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చేయలేని పనంటూ ఏమీలేదన్నట్టుగా తయారైంది పరిస్థితి! అందుక్కారణం లెక్కకుమిక్కిలిగా ఉన్న యాప్ లే. ప్రతి పనికీ ఓ యాప్ అందుబాటులో ఉండడంతో ఎంతో క్లిష్టమైన కార్యాలు సైతం సులువుగా జరిగిపోతున్నాయి. ఈ యాప్ లలో కొన్ని ఫన్ క్రియేట్ చేయడానికి ఉద్దేశించినవి. అలాంటివాటిలో జెండర్ స్వాప్ ఫిల్టర్ అనే యాప్ కూడా ఉంది. స్నాప్ చాట్ లో ఇదో ఫీచర్ గా అందుబాటులో ఉంది.
అయితే, ఈ జెండర్ స్వాప్ ఫిల్టర్ అమ్మాయిల ముఖాలను అబ్బాయిలుగా, అబ్బాయిల ముఖాలను అమ్మాయిలుగా మార్చేస్తుంది. బ్రిటన్ కు చెందిన జేక్ ఆస్క్యూ అనే యువకుడు కూడా ఈ యాప్ సాయంతో తన ముఖాన్ని అందమైన అమ్మాయి ముఖంగా మార్చుకున్నాడు. ఆ ఫొటోను ఫేమస్ డేటింగ్ సైట్ టిండర్ లో పెట్టగా అబ్బాయిల నుంచి విపరీతమైన స్పందన లభించింది.
తన పేరును జెస్ గా పేర్కొన్న జేక్ ఆస్క్యూ తన అమ్మాయి ముఖంతో ఉన్న ఫొటోకు వస్తున్న లైకులు, ప్రపోజల్స్ చూసి దిగ్భ్రాంతి చెందాడు. వేయికి పైగా లైకులతో పాటు ఏకంగా 400 మంది లవ్ ప్రపోజల్స్ పంపడం విశేషం. అయితే వాటిలో కొన్ని అశ్లీల ప్రపోజల్స్ ఉండడంతో జేక్ ఆస్క్యూ అసలు విషయం బయటపెట్టాడు. దాంతో తొందరపడి ప్రపోజ్ చేసినవాళ్లు అవాక్కయ్యారు.