Dhone: ప్రియురాలితో బైక్ పై వెళ్లిన ప్రియుడు మృత్యు ఒడికి... ఎన్నో అనుమానాలు!
- డోన్ సమీపంలో ఘటన
- రైల్వే ట్రాక్ పై యువకుడి మృతదేహం
- ప్రియురాలిని విచారిస్తున్న పోలీసులు
తన ప్రియురాలితో ఒంటరిగా గడిపేందుకు బైక్ పై వెళ్లిన ఓ యువకుడు రైల్వే ట్రాక్ పక్కన విగతజీవిగా కనిపించగా, అతని మృతి వెనుక ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటన డోన్ మండలం మాల్యాలలో తీవ్ర కలకలం రేపింది. గడచిన కొంత కాలంగా డోన్ కు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్న మనోహర్ అనే యువకుడి మృతదేహం, గత రాత్రి రైల్వే ట్రాక్ పై కనిపించింది.
తనతో వచ్చిన మనోహర్ ను రైలు ఢీకొందని యువతి చెబుతుండగా, మనోహర్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మరణం వెనుక కుట్ర ఉందని అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం మనోహర్ ప్రియురాలిని విచారిస్తున్నారు. ఇద్దరూ కలిసి బైక్ పై వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు, బైక్ ను దూరంగా పెట్టి, రైల్వే ట్రాక్ వైపు ఎందుకు వెళ్లారన్న కోణంలో విచారిస్తున్నట్టు సమాచారం. ఆమె సెల్ ఫోన్ ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను, మెసేజ్ లను పరిశీలిస్తున్నారు.