Andhra Pradesh: రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది... ఇక కౌంటింగ్ కు ఏర్పాట్లు మొదలుపెడతాం: ద్వివేది
- మంగళవారం నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు షురూ
- పాతికవేల మందితో కౌంటింగ్
- ఒక్కో నియోజకవర్గానికి 180 మంది సిబ్బంది కేటాయింపు
ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్రంలో ఇవాళ జరిగిన రీపోలింగ్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించామని, అంతా ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేసి, మండే ఎండల్లో సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా రీపోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారని అభినందించారు.
రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఇక మిగిలింది కౌంటింగ్ మాత్రమేనని, మంగళవారం నుంచి కౌంటింగ్ కు ఏర్పాట్లు మొదలుపెడతామని ద్వివేది వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాతికవేల మంది సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 180 మందితో కౌంటింగ్ జరుపుతామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం రెండు దశల్లో సిబ్బంది ఎంపిక ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు గాను ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.