Chandrababu: టీడీపీకి, రాష్ట్రానికి ఇది శుభసంకేతం: చంద్రబాబు
- అన్ని సర్వేలు టీడీపీకి అనుకూలం
- గెలుపుపై సందేహాలు వద్దు
- రాజమండ్రి నేతలతో చెప్పిన టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలింగ్, దాని తదనంతర పరిణామాలపై పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం రాజమండ్రి అర్బన్, రూరల్ అభ్యర్థులు, నేతలతో సమావేశమైన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, ఇది పార్టీకి, రాష్ట్రానికి శుభసంకేతంగా భావిస్తున్నామని చెప్పారు. గెలుపుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదని కార్యకర్తల్లో ఉత్సాహం నూరిపోశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ తన ఆధిక్యతను నిలుపుకోవడంపై దృష్టి పెట్టాలని కర్తవ్య బోధ చేశారు.
అయితే ఈ ఐదేళ్లలో తాను పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని చంద్రబాబు అంగీకరించారు. కొత్త రాష్ట్రం కావడంతో వ్యవస్థల నిర్మాణానికే ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. ఈ కారణంగానే పార్టీకి కేటాయించే సమయం తగ్గిందని వివరణ ఇచ్చారు. ఇకపై పార్టీకి పూర్తి ప్రాధాన్యత ఉంటుందని, ప్రతిరోజు రెండుమూడు గంటలపాటు పార్టీ కోసం సమయం వెచ్చిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 3 నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గాలపైనా సమీక్ష జరుపుతానని తెలిపారు.